శ్రీ శివాభ్యాం నమః
వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి || 11 ||
ఓ శివా! మానవుడు, బ్రహ్మచారియైననూ, గృహస్థైననూ, సన్యాసియైననూ, జటాధారియైననూ, మరి ఇంక ఎట్టివాడైనా కానిమ్ము దానిచేత (ఆయా ఆశ్రమముల చేత) ఏమి అగును? కానీ ఓ పశుపతీ! ఎవని హృదయపద్మము నీవశమగునో, నీవు అతనివాడివై అతని సంసార భారమును మోసెదవు.
గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాంతఃకరణమపి శంభో! తవ పదే
స్థితం చేద్యోగోసౌ స చ పరమయోగీ స చ సుఖీ || 12 ||
ఓ శంకరా! మనుజుడు, గుహలో కానీ, ఇంటిలో కానీ, బయటనెచ్చటో కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరముపై కానీ, నీటియందు కానీ, పంచాగ్నిమధ్యమందు కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏమి లాభము? ఎవడి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు స్థిరముగానుండునో అతడే గొప్పయోగి మరియూ అతడే పరమానందము కలవాడు అగును.
అసారే సంసారే నిజభజనదూరేఽజడ ధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్ |
మదన్యః కో దీన స్తవ కృపణరక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే || 13 ||
ఓ పశుపతీ ! నీ సేవకు దూరమైన నిస్సారమైన ఈ సంసారములో గ్రుడ్డివాడనై భ్రమించునాకు మిక్కిలికరుణతో జ్ఞానమిచ్చి బ్రోవవయ్యా!. నాకన్నా దీనుడు నీకు ఎవరున్నారు ? ముల్లోకాలకూ నీవే దీనరక్షకుడవు, శరణువేడదగినవాడవు.
ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వమనయోః |
త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః || 14 ||
ఓ పశుపతీ! నీవు సమర్థుడవు, దీనులకు ముఖ్యబంధువువు కదా. నేను ఆ దీనులలో మొట్టమొదటివాడను. ఇంక మన ఇద్దరి బంధుత్వము గురించి వేరే చెప్పనక్కరలేదు కదా. ఓ శివా! నా సమస్త అపరాధములనూ నీవు క్షమించుము. నన్ను ప్రయత్నపూర్వకముగా రక్షించుము. ఇదేకదా బంధుమర్యాద (బంధువులతో మెలగవలసిన తీరు).
ఉపేక్షా నో చేత్కిం న హరసి భవద్ధ్యాన విముఖాం
దురాశాభూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్|| 15 ||
ఓ పశుపతీ! నీకు నా పై ఉపేక్ష లేనిచో నిన్ను ధ్యానించుటకు వెనుకాడునదీ, దురాశలతో నిండినదీ అయిన నా తలరాతను ఏల తుడిచివేయవు ? అందుకు సమర్థుడవు కానిచో (కాను అంటావేమో) ఏ ప్రయత్నమూ లేకుండా చేతిగోరుకొనతో దృఢమైన బ్రహ్మ శిరస్సును ఎలా పెకలించావు ?
విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః || 16 ||
సదాశివా! నాకేల విచారము ? బ్రహ్మదేవుడు భూమిపై ప్రజలకు దీనత్వమును (లలాటముపై) వ్రాసినాడు. (ఆ కారణముగా నేను దీనుడగుటచేత) దీనులను కాపాడు నీ కటాక్షము నిర్మలమైన కృపతో స్వయముగా నన్ను రక్షించుచున్నది. బ్రహ్మదేవుని నాల్గు శిరములను నీవు రక్షించుము. ఆయన దీర్ఘాయువగుగాక.
(బ్రహ్మదేవుడు దీనత్వమును వ్రాయుటచేతనే జనులకు శివుని కటాక్షమునకు పాత్రత కలిగినది కనుక అతనిని రక్షింపుమని వినతి).
ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః || 17 ||
ప్రభో! నా పుణ్యముచేతనో నీ కరుణచేతనో నీవు నాపై ప్రసన్నుడవైననూ, స్వామీ! నీ నిర్మల పాదపద్మములను ఎలా చూడగలను ? నీకు నమస్కరించుటకై తొందరపడు దేవతలసమూహము తమ రత్నకిరీటములతో నన్ను అడ్డగించుచున్నది.
త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః |
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా || 18 ||
ఓ శివా! లోకంలో నీవొక్కడవే మోక్షమునిచ్చువాడవు. విష్ణ్వాది దేవతలు నీవనుగ్రహించిన పదవులననుభవించుచూ (ఇంకనూ ఉత్తమ పదవులకై) నిన్ను కొలుచుచున్నారు. భక్తులపై నీకెంత దయ (అపరిమితము). నా ఆశ ఎంత (ఇంత అని చెప్పలేను). నా అహంభావమునుబాపి సంపూర్ణకటాక్షముతో ఎప్పుడు నన్ను రక్షించెదవు ?
దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే
దురన్తే సంసారే దురితనిలయే దుఃఖజనకే |
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ || 19 ||
ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను (అలా వ్రాసిన) బ్రహ్మదేవునియందు వాత్సల్యముచేత, తొలగించుటలేదు కాబోలు. నీవు (అలా) భక్తవత్సలుడవైనప్పుడు నిన్ను భజించి మేమూ కృతార్థులమవుతునాము కదా!
— వేరొక అర్థము
ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను ఎందుకు తొలగించవు ? సహాయంచేయమని ఎవరినడుగను ? నిన్ను భజించి (ప్రీతి కలిగించి) మేమూ కృతార్థులమవుతున్నాము కదా!
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో || 20 ||
ఓ కపాలధారీ, సర్వవ్యాపకా, శివా, ఆదిభిక్షూ, నా దగ్గర ఒక కోతి ఉంది. అది, మోహమనే అడవిలో చరించుచున్నది, యువతుల స్తనములనే పర్వతములపై క్రీడించుచున్నది. ఆశా శాఖలపై దూకుతున్నది. అటునిటు వేగముగా పరుగులిడుతున్నది. అత్యంత చపలమైన నా మనస్సనే ఈ కోతిని భక్తి (అనే త్రాడు) తో కట్టివేసి నీ వశం చేసుకొనుము.
(నా చంచల చిత్తమునకు త్వదేక శరణమైన భక్తిననుగ్రహింపుమని భావము).
ShivanandaLahari