ఈశావాస్యోపనిషత్ – శంకరుల ఉపోద్ఘాతము

ఈశావాస్యోపనిషత్ – శంకరభాష్యము
శంకరుల ఉపోద్ఘాతము
శంకరులు ఈ‌ మంత్రముల వ్యాఖ్యానకారణము తెలుపుతున్నారు.

భాష్యం:
ఈశావాస్యమిత్యాదయో మన్త్రాః కర్మస్వనియుక్తాః‌ |‌ తేషామకర్మశేషస్యాత్మనో‌యాథాత్మ్యప్రకాశకత్వాత్ |‌ యాథాత్మ్యం చాత్మనః శుద్ధత్వాపాపవిద్ధత్వైకత్వనిత్యత్వాశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణమ్ | తచ్చ కర్మణా విరుధ్యేతేతి యుక్త ఏవైషాం కర్మస్వవినియోగః |

న హ్యేవం లక్షణమాత్మనో‌ యాథాత్మ్యముత్పాద్యం వికార్యమాప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా యేన కర్మశేషతా స్యాత్ |

సర్వాసాముపనిషదామ్ ఆత్మయాథాత్మ్యనిరూపణేనైవ ఉపక్షయాత్ | గీతానాం మోక్షధర్మాణాం చైవం పరత్వాత్ | తస్మాత్ ఆత్మనః అనేకత్వకర్తృత్వభోక్తృత్వాది చ అశుద్ధత్వపాపవిద్ధత్వాది చ ఉపాదాయ లోకబుద్ధిసిద్ధకర్మాణి విహితాని చ |

యో హి కర్మఫలేనార్థీ దృష్టేన బ్రహ్మవర్చసాదినా దృష్టేన స్వర్గాదినా చ ద్విజాతిరహం న కాణకుబ్జత్వాద్యనధికారప్రయోజక ధర్మవాన్ ఇత్యాత్మానం మన్యతే సోఽధిక్రియతే కర్మస్వితి హ్యధికారవిదో వదన్తి.

తస్మాదేతే మన్త్రా ఆత్మనో యాథాత్మ్యప్రకాశనేన ఆత్మవిషయం స్వాభావికమజ్ఞానం నివర్తయన్తః శోకమోహాది సంసారధర్మవిచ్ఛిత్తి సాధనమ్ ఆత్మైకత్వాదివిజ్ఞానమ్ ఉత్పాదయన్తి |‌ ఇత్యేవముక్తాధికార్యభిధేయసంబంధప్రయోజనాన్ మంత్రాన్ సంక్షేపతో వ్యాఖ్యాస్యామః |

తాత్పర్యము:
కర్మశేషములేని ఆత్మయొక్క యదార్థస్వరూపము ప్రకాశింపజేయుటచేత ‘ఈశావాస్యమ్’ మున్నగు మన్త్రాలు కర్మలయందు వినియోగములేని మంత్రాలు. ఆత్మయొక్క యదార్థస్వరూపము అనగా తరువాత చెప్పబడు శుద్ధత్వము, నిష్పాపత్వము, ఏకత్వము, నిత్యత్వము, అశరీరత్వము, సర్వగతత్వము మొదలగునవి. ఈ ఆత్మ యదార్థస్వరూపమునకు కర్మతో‌ విరోధము. కాబట్టి ఈ మంత్రములకు కర్మలయందు వినియోగము లేకుండుట యుక్తమే.

ఆత్మయొక్క ఇట్టి లక్షణములుగల యదార్థస్వరూపము, పుట్టునది గాని, మార్పుచెందునదిగాని, పొందదగినదిగాని, సంస్కరింపబడునదిగాని, కర్తృభోక్తృరూపములుగాని కాదు. ఇటువంటి ధర్మము(ల)తో కర్మశేషము.

ఉపనిషత్తులన్నియు ఆత్మయొక్క స్వరూపము నిర్ణయించుటయందే పర్యవసానము చెందుతున్నవి. గీతలు, మోక్షధర్మములన్నింటికిని దీనియందే (ఆత్మ స్వరూపము నిర్ణయించుటయందే) తాత్పర్యము. కనుక సామాన్యప్రజలబుద్ధిననుసరించియే ఆత్మకు అనేకత్వము, కర్తృత్వము, భోక్తృత్వము, అశుద్ధత్వము, పాపయుక్తత్వమును గ్రహించియే కర్మలు విధించబడినవి.

ఎవరు కర్మఫలములగు బ్రహ్మవర్చస్సు మున్నగు దృష్టఫలములనందునూ, స్వర్గాది అదృష్టఫలములనందునూ ఇచ్ఛగలవాడగుచున్నాడో, నేను ద్విజుడను, కర్మాధికారములేని గ్రుడ్డివాడనూ, గూనివాడనూ కాను అని తలచుచున్నాడో అతడే కర్మలయందు అధికారము కలవాడు అని కర్మాధికారము తెలిసినవారు చెప్పుచున్నారు.

కనుక ఈ‌ మన్త్రములు ఆత్మయొక్క యదార్థస్వరూపము ప్రకాశింపజేయుటచేత ఆత్మసంబంధమైన స్వాభావిక అజ్ఞానము పోగొట్టునవి. సంసారధర్మములను నాశనముజేయు సాధనమైన ఆత్మఏకత్వ విజ్ఞానమును కలిగించునవి. కాబట్టి ఇలా చెప్పబడిన అధికారి (ముముక్షువు) అభిధేయములకు (ఆత్మస్వరూపవిషయము) సంబంధించిన ప్రయోజనము (అజ్ఞాన నివృత్తి, ఆత్మస్వరూపజ్ఞాన ప్రాప్తి) కలిగించు మన్త్రములను సంక్షేపముగా వ్యాఖ్యానించెదము.

3 Comments

  1. I found this site accidentally. It is an amazing site. I feel blessed. Will need a lot of time to go through.

    Do you have Sankara bhashyam for for all mantras in Isopanishad?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s