వినాయకుని వలెను బ్రోవవే
మధ్యమావతి – ఆది
పల్లవి:
వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ?
॥వినాయకుని॥
అను పల్లవి:
అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని
॥వినాయకుని॥
చరణము(లు):
నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవతలు
రాయడిని జెందరాదు దయ జూడరాదా కాంచీపురాది నాయకి
॥వినాయకుని॥
పితామహుఁడు జనహితార్థమై నిన్ను తా తెలియ వేడ తాళిమిగల
యవతార మెత్తె యికను తామసము సేయ తాళజాలము నతార్తి హారిణి
॥వినాయకుని॥
పురాన దయచే గిరాలు మూకుకి రాజేసి బ్రోచిన రాజధరి
త్యాగరాజుని హృదయ సరోజ మేలిన మురారి సోదరి పరాశక్తి నను
॥వినాయకుని॥
భావార్థవివరణ
కాంచీపురమునందు వెలసియున్న శ్రీకామాక్షీదేవిని గూర్చి ఈ కీర్తనయందు ప్రార్థించినారు.నీ కుమారుడయిన వినాయకుని కాపాడిన రీతిని నన్ను రక్షించుము (సుజనాఘ మోచని-) సజ్జనుల పాపములను హరించుదానా! అనాథరక్షకి! నీచమానవులకు నీవు వరములనివ్వగా, (రాములై-) నీయందు అనురాగము కలవారయి ఉండగా భూసురాది దేవతలు అందరూ, నరాధములవలన(రాయిడిని-) రాపిడిని, ఒత్తిడిని పొందవలసినదేనా?శంకరీ! కాంచీపురాధి నాయకీ! జననీ! దయచూడుము.
(పితామహుడు-) బ్రహ్మ ప్రార్థనపై పరదేవత కామాక్షీ రూపమున అవతరించినట్లు సూచితమగుచున్నది.నతులయినవారి ఆర్తిని హరించునట్టి ఓ జననీ! నీ దయ (మూకునికి రాజేసి-) మాకు ఉండునట్లుగా వరములిచ్చి కాపాడుము(రాజధరి-) చంద్రుని ధరించినదాన! (మురారిసోదరి-) మురారి సోదరివయి ఉన్నందున పరాశక్తీ! త్యాగరాజుయొక్క హృదయపద్మమును రక్షించునట్టి (పురాణి-) అనాది స్వరూపిణీ! నీకన్నా గొప్ప దేవతలు లేరమ్మా నన్ను నీకుమారుని(వినాయకుని) వలె కాపాడుము.
Tyagaraja Kriti :Vinayakuni valenu brovave