భవాన్యష్టకం

॥ శ్రీ శంకరాచార్య కృతం భవాన్యష్టకం ॥

న తాతో న మాతా న బన్ధుర్న దాతా 
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా ।
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 1॥

ఓ భవానీ! తల్లీ! నాకు తల్లిగాని, తండ్రిగాని, కొడుకుగాని, కూతురుగాని, యజమానిగాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియూ లేదు. కేవలము నీవొక్కతవే నాకు దిక్కు, నాకు దిక్కు.

భవాబ్ధావపారే మహాదుఃఖభీరు 
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః ।
కుసంసారపాశప్రబద్ధః సదాహం  
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 2॥

అమ్మా! భవానీ! కామాంధుడనై, లుబ్ధుడనై, మత్తుడనై, జన్మపాశబద్ధుడనై, తట్టుకొనలేని దుఃఖముతో మిక్కిలి భయగ్రస్తుడనై, అవ్వలియొడ్డులేని సంసారసాగరమున పడిపోయితిని. తల్లీ నీవేతప్ప నాకెవరుదిక్కు లేరు. నీవొక్కతివేదిక్కు.

న జానామి దానం న చ ధ్యానయోగం 
న జానామి తన్త్రం న చ స్తోత్రమన్త్రమ్ ।
న జానామి పూజాం న చ న్యాసయోగం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 3॥

ఓ భవానీమాత! దానము – ధ్యానము- మంత్రము – యంత్రము – పూజ – పునస్కారము – న్యాసము – యోగము – ఏదియునూ తెలియదు. నీవేతప్ప నాకు వేరే దిక్కు లేదు. నీవేదిక్కు.

న జానామి పుణ్యం న జానామి తీర్థం 
న జానామి ముక్తిం లయం వా కదాచిత్ ।
న జానామి భక్తిం వ్రతం వాపి మాతః
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 4॥

అమ్మా! భవానీ! పుణ్యకార్యము లేదు, తీర్థసేవ లేదు, మోక్షోపాయము తెలియదు, జన్మరాహిత్యము తెలియదు, భక్తి మార్గము తెలియదు, ఏ వ్రతములూ నోములూ తెలియవు, తల్లీ నీవే దిక్కు నీవేదిక్కు.

కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః 
కులాచారహీనః కదాచారలీనః ।
కుదృష్టిః కువాక్యప్రబన్ధః సదాహం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 5॥

తల్లీ నేనెట్టివాడననుకొనుచుంటివి. దుష్కర్మాచరణము – దుస్సాంగత్యము – దుర్బుద్ధులు – దుష్టసేవకజనము – కులాచారహీనత్వము – దురాచార తత్పరత – దురాలోచనలు – దుర్వాక్యములు  ఇవి నా లక్షణములు. అందుచేత నన్నుద్ధరించుటకు నీవు తప్ప వేరే దిక్కు లేదు, లేదు.

ప్రజేశం రమేశం మహేశం సురేశం 
దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ ।
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 6॥

ఓ సర్వశరణ్యా! బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు – ఇంకెందరెందరో దేవతలు ఉన్నారు. ఒక్కర్ని గురించి కూడ నేను ఎఱుగను. నాకు తెలియదు. నీవే దిక్కు తల్లీ, నీవే దిక్కు.

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే 
జలే చానలే పర్వతే శత్రుమధ్యే ।
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 7॥

ఓ మాత! ఏదైన వివాదమున గాని – విషాదమునగాని – ప్రమాదమునగాని – ప్రవాసమునగాని – నీటిలోగాని – నిప్పులోగాని – కొండలమీదగాని – అడవులలోగాని – శత్రువులమధ్యగాని – ఎక్కడైనాసరే నన్ను నీవే రక్షింపవలయునమ్మా! నాకు నీవే దిక్కు అమ్మా. నీవే దిక్కు.

అనాథో దరిద్రో జరారోగయుక్తో 
మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః ।
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 8॥

ఓయమ్మా! నేను దరిద్రుడను. ముసలితనము – రోగములు – జాడ్యములు – నన్నాక్రమించియున్నవి. మహావిపత్సముద్రమున మునిగి యున్నాను. సర్వవిధముల కష్ట, నష్టములపాలై వున్నాను. కావున నీవే నన్ను ఉద్ధరింపవలయును. నాకు  నీవే దిక్కు . నీవే దిక్కు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం భవాన్యష్టకం సమ్పూర్ణమ్ ॥

Bhavani Ashtakam