గాజుల గౌరి కథ

 గాజుల గౌరి కథ  

ఒక బ్రాహ్మణుని కోడలు గాజుల గౌరి నోము పట్టి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెను చూచి అంతా చిటపటలాడుచుండేవారు. అత్త , మామ , మగడు , ఆడపడచులు , తోటికోడళ్ళు అందరూ ఆమెను చూసి చిటపటలాడుచుండెరివారు. అప్పుడు ఆ చిన్నది విచారించుచూ అడవిలోకిపోయి తిరుగుచుండెను. అంతట పార్వతీపరమేశ్వరులు భూమిపాలించుటకు వచ్చి , ఆ చిన్నదాన్ని చూచి ఏమి? అలా విచారించుచూ తిరుగుచున్నావు అని అడిగిరి. అందుకు ఆమె ఇరుగు పొరుగు అత్తామామా మగడు నన్ను చూస్తే కోపంగా ఉంటారు . అందుచేత అందరికీ కోపము అయితే ఎట్లు బ్రతకనని ఇలా తిరుగుచున్నానని చెప్పెను. అలా కాదమ్మా ! నీవు గాజుల గౌరి నోము పట్టి ఉల్లంఘన చేసినావు . ఆకారణమున నిన్ను చూచిన అందరికీ కోపముగానున్నది. నీవు తిరిగి ఆ నోము పట్టి ఉద్యాపన చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారము ఆమె ఇంటికి వెళ్ళి ఆ నోము నోచుకొని యధావిధిగా ఉద్యాపన చేసికోగా అప్పటినుండి ఆమె అందరికీ ఇష్టముకలదయ్యెను.

ఉద్యాపన:

ఒక ముత్తైదువును తీసుకుని వచ్చి ఆమెకు ఇష్టమైన గాజులు తొడిగించి , తలంటి నీళ్ళుపోసి , చీర రవికలగుడ్డ ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టవలెను. భక్తి తప్పినా ఫలము తప్పదు. కథ లోపమైననూ వ్రతలోపము కాకూడదు.

Gajula Gowri Nomu